టీడీపీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ స్కాములో అరెస్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఆయనను అరెస్ట్ చేసి సుమారు రెండు వారాలు కావస్తుంది. ఇంకా బెయిల్ రాలేదు, ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. దానికి తోడు, లోకేష్ ని అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో టీడీపీ మనుగడ సాధ్యమేనా ?
40 సంవత్సరాలుగా రాజకీయాలు , 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం సామాన్యమైన విషయంకాదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పగడ్బందీగా అరెస్ట్ చేసి రెండు వారాలుగా జైల్లోనే ఉంచగలిగింది. ఈ అరెస్టుకి సానుభూతి వస్తుందని టీడీపీ గట్టిగానే నమ్మింది, కానీ చూస్తే వాస్తవ పరిస్థితులు అలా లేవు. పార్టీ అనుకున్నంతగా క్యాడర్ స్పందించలేదు. ఇది కక్ష సాధింపు చర్యగా కనిపించినా, సానుభూతి అయితే అంతగా రాలేదు అనేది వాస్తవం.
ఇంతలో లోకేష్ అరెస్ట్ ఊహాగానాలు ఊపందుకున్నాయి. లోకేష్ ఢిల్లీ టూర్ నుంచి ఇంకా తిరిగి రాకపోవడం, బ్రాహ్మణి, బాలకృష్ణ ఎప్పుడు లేనంతగా మీడియాలో ఉండడం చూస్తుంటే ఇంకో అరెస్ట్ జరగడానికి అవకాశం ఉందన్న అనుమానాలు వస్తున్నాయి.
ఇన్ని ఒడిదుడుగులలో, పార్టీ మనుగడ సాధ్యమేనా? కానీ చంద్రబాబు నాయుడు చాణక్యతని తక్కువ అంచనా వేయలేము. ఆయనకి తోడుగా సొంత మీడియా ఎప్పుడు ఉంటుంది. ఒక ప్రచారాన్ని జనాల్లోకి ఎప్పుడు తీసుకెళ్లాలో, ఎలా తీసుకెళ్లాలో బాగా తెలిసినవారు. ఏ వ్యక్తికి అయినా జీవితంలో హెచ్చులు, తగ్గులు ఉంటాయి. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా, 16 నెలలు జైల్లో గడిపినవారే. కానీ ప్రజలు వైస్సార్సీపీకి 151 స్థానాలు ఇచ్చి అసెంబ్లీకి పంపించారు. ఇలాంటి అవమానం నుంచి టీడీపీ పార్టీ ఎలా బయటపడుతుందో చూద్దాం !!!