ఇటీవలే జనసేన, టీడీపీ పార్టీల పొత్తుని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన, టీడీపీ పార్టీలు కలిసి పోరాటాలు చేస్తాయని, 2024 ఎలక్షన్స్ లో కలిసి వైస్సార్సీపీ ని ఓడిస్తారని చెప్పారు.
చంద్రబాబు నాయుడుని కస్టడీలోకి తీసుకున్న తర్వాత, టీడీపీ పార్టీ ఎంతో కొంత గందరగోళంలో ఉంది. ఇప్పటికే లోకేష్ కి ఔటర్ రింగ్ రోడ్ కేసులో ఏపీ CID నోటీసులు కూడా ఇచ్చారు. ప్రస్తుతానికి లోకేష్ ని అరెస్ట్ అయితే చేయలేనప్పటకి, గత 20 రోజులుగా పాదయాత్ర ఆపేయడం, ఢిల్లీ లోనే ఉండిపోవడం చూస్తుంటే, టీడీపీ ఎంతో కొంత కష్టకాలం లో ఉందేమో అనిపిస్తుంది.
ఇలాంటి సమయంలో ఆ అవకాశాన్ని అందుకోవాల్సింది పోయి, టీడీపీ తో పొత్తు ఎందుకు అన్న ప్రశ్న చాలా మందిలో ఉంది. డబ్బులు పంచకుండా, ఓట్లు కొనకుండా ఎలక్షన్ లో పోటీచేసి గెలవాలి అనేది జనసేన ముఖ్య సిద్ధాంతం. ఆర్థికంగా, సామాజికంగా, మీడియా పరంగా చాలా బలమైన తెలుగుదేశం పార్టీ స్థానాన్ని భర్తీ చేయాలంటే, జనసేన పెట్టుకున్న ఆ ముఖ్య సిద్ధాంతాన్ని సైతం పక్కన పెట్టాలేమో. డబ్బులు పంచకుండా, ఓటరుని కొనకుండా, ఓట్ల శాతం గణనీయంగా పెరగడం అంటే కొంచెం కష్టమే. ఇవన్నీ పవన్ కళ్యాణ్ కి తెలియనివి కాదు, పైగా ఆయన గత 3 ఎలక్షన్ ని చాలా దగ్గరగా గమనించారు.
కుల సమీకరణాలు, డబ్బుతో పాటు, తెలుగు రాజకీయాలు అంటే మీడియా మానేజ్మెంట్. అనుకూల మీడియా ద్వారా ప్రజల మనసుల్ని, ఆలోచనల్ని నియంత్రించడం చాల సాధారణం. అసలే జనసేనకి మీడియా లేదు, అలాంటిది టీడీపీ, వైస్సార్సీపీ మీడియాకి నిలబడి బలంగా సీట్లు సాధించడం కొంచెం కష్టమే. ఒకవేళ ఒంటరిగా పోటీ చేసినా, ఓట్లు చీలిపోయి వైస్సార్సీపీ గెలిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయ్. ఇలాగే జరిగితే, ఇంకో 5 సంవత్సరాలు పార్టీ కార్యకర్తల్ని మానసికంగా ధైర్యంగా ఉంచడం అంత సులువైన పని కాదు. పైగా జనసేన ఆర్థికంగా బలమైన పార్టీ కూడా కాదు, పవన్ కళ్యాణ్ సినిమాలు చేసిన డబ్బులు, అభిమానులు స్వచ్చందంగా ఇచ్చిన డబ్బుల మీదే నడుస్తుంది.
ఒంటరిగా కాకుండా, టీడీపీ తో కలిసి ప్రయాణం చేస్తే, టీడీపీ + జనసేన + ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కలుస్తాయి కాబట్టి, పోటీ చేసిన సీట్లలో చాలా వరకు గెలిచే అవకాశం ఉంటుంది. గత పది సంవత్సరాలుగా పార్టీ ని నమ్ముకున్న వారిని తనతో పాటుగా అసెంబ్లీ కి తీసుకువెళ్ళడానికి ఇదే మంచి అవకాశం అనిపించి ఉండొచ్చు . ఇంత కాలం ప్రశించడం అయ్యింది, ఎం చేస్తారో చెప్పడం అయ్యింది, అప్పుడు నిజంగా చేసి చూపించే అవకాశం ఈ విధంగా వస్తుంది అని పవన్ కళ్యాణ్ నమ్మారేమో.
గెలిచి టీడీపీతో అధికారం పంచుకుని, విధాన పరంగా రాష్ట్రానికి అభివృద్ధి చేస్తే, పార్టీని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బలపరుచుకోడానికి మొదటి మెట్టు అవుతుంది. వేరుగా వెళ్లి, ఏమి జరుగుతుందో తెలియని దారి ఎంచుకోవడం కంటే కూడా, టీడీపీతో కలిసి వెళ్లి జనసేనని నమ్ముకున్న వాళ్ళందర్నీ రాజకీయంగా ఒక అడుగు ముందుకి నడపడమే మంచి నిర్ణయం అనిపిస్తుంది.